ముంబై ఢమాల్... సంజూ సెంచరీ, అకీల్ స్పిన్ మ్యాజిక్ తో సీఎస్కే సూపర్ విక్టరీ

  • ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం
  • అజేయ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్
  • 4 వికెట్లతో ముంబై బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన అకీల్ హోసేన్
  • 103 పరుగుల భారీ తేడాతో గెలిచిన సీఎస్కే
  • పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుత విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ (101*) అద్భుత శతకంతో కదంతొక్కగా, బౌలింగ్‌లో అకీల్ హోసేన్ (4/17) మాయ చేయడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది.

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అకీల్ హోసేన్ ధాటికి ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (36), తిలక్ వర్మ (37) కాసేపు పోరాడినా, వీరిద్దరూ ఔటయ్యాక మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్లలో అకీల్ హోసేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21) నుంచి కొంత సహకారం లభించింది. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.


CSK
MI
Wankhede Stadium
IPL 2026

More Telugu News